టీడీపీ నరసరావుపేట లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త పుట్టా మహేష్ యాదవ్ ఆశిస్తున్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును సోమవారం పుట్టా కలిసి కోరారు. మహేష్ యాదవ్ తండ్రి కడప జిల్లా మైదకూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. టీటీడీ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేసిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు మహేష్ యాదవ్ అల్లుడు. తండ్రి, మామ ఇద్దరూ టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అల్లుడు కోసం మామ యనమల మంత్రాంగం నడుపుతున్నారు. టిక్కెట్ విషయమై చంద్రబాబుతో యనమల చర్చలు కూడా జరిపారు. మహేష్ అంశంపై అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఇది కలిసివచ్చే అంశంగా పార్టీ భావిస్తున్నది.