క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ. టీమిండియా పరుగుల మెషిన్, కింగ్ కోహ్లీ, రికార్డుల వీరుడు, చేజింగ్ మాస్టర్ ఇలా కోహ్లీకి క్రికెట్ ప్రపంచం ముద్దుగా పెట్టుకున్న పేర్లు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో రికార్డుల మోత మోగించిన కింగ్ కోహ్లీ నేడు 34వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తోటి క్రీడాకారులు, ప్రముఖులు అభిమానులు కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తూ.. టీమిండియా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రికార్డుల రారాజుగా.. రన్ మెషీన్‌గా మనమంతా ముద్దుగా పిలుచుకున్నా.. ఆ కష్టం వెనుక ఎన్నటికీ మర్చిపోలేని కన్నీటి సాగరం ఉంది. నేను ఇండియా తరుపున ఆడాలనేది మా నాన్న కల. మా నాన్న మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. ఆ కష్ట కాలం నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆ రోజే భారత్‌కు ఆడతానని మా సోదరుడికి వాగ్దానం చేశాను. అప్పటి నుంచి నా జీవితంలో క్రికెట్ తరువాతే అన్ని. ఏ కారణంతో అయినా క్రికెట్‌ను విడిచిపెట్టకూడదని అనుకున్నా. మా తండ్రి మరణం నాకు కష్టకాలంలో పోరాడాలని నేర్పింది..’ అంటూ కోహ్లీ గతంలో చెప్పుకొచ్చాడు.
1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించిన విరాట్.. తన ప్రతిభతో క్రికెట్ ప్రపంచంలో అగ్రస్థానంకు చేరుకున్నాడు. కోహ్లీ తల్లి గృహిణికాగా తండ్రి క్రిమినల్ లాయర్‌గా పనిచేశారు. తన ఇద్దరు తోబుట్టువులతో కలిసి కోహ్లీ ఉత్తమ్ నగర్‌లో పెరిగాడు. కోహ్లీ విశాల్ భారతి పబ్లిక్ స్కూల్‌లో చదివాడు. 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీకి వెళ్ళాడు. 2002లో ఢిల్లీ అండర్-15 జట్టుతో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. 2003-2004 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీకి జట్టు కెప్టెన్ అయ్యాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-17 జట్టుకు 2004లో ఎంపికయ్యాడు.
టీమిండియాలోకి 2008లో అరంగేట్రం చేశాడు. విరాట్‌కి నేటితో 34 ఏళ్లు. కోహ్లీ ఇప్పటివరకు 102 టెస్టులు, 262 వన్డేలు, 113 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 27 టెస్టులు, 28 హాఫ్ సెంచరీలతో 8074 పరుగులు, వన్డేల్లో 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో 12,344 పరుగులు చేశాడు. అతను అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 36 అర్ధ సెంచరీలతో 3,932 రన్స్ చేశాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లో మూడు హాఫ్ సెంచరీలతో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. విరాట్ బర్త్ డే సందర్బంగా ట్విట్టర్ ద్వారా పలువురు విషెష్ అందిస్తున్నారు.