తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మక స్థాయిలో విరాళాలు ప్రకటించారు. తానా 45 సంవత్సరాల చరిత్రలో మహాసభల విరాళాల సేకరణలో సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో జరిగిన అన్ని విరాళాల సేకరణని మించిపోయేలా దాదాపు ₹48 కోట్ల ($6 మిలియన్ల) విరాళాలు ప్రకటించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ,EC,BOD, ఫౌండేషన్ సభ్యులను, మాజీ అధ్యక్షులను, ఇతర కమిటీ సభ్యులను పరిచయం చేసి సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫిలడెల్ఫియా నగరంలో 2023 జులై 7-9 వరకు జరగబోతున్న తానా మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 5నాడు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వార్మిన్స్టర్ నగరంలోని ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమానికి అంచనాలకి మించిన స్పందన లభించింది. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ విందులో ఎనిమిది వందల మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు.