రాబోయే ఎన్నికల్లో పులివెందులలో తెదేపా గెలుపునకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) అన్నారు. విజయవాడలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని మంగళవారం ఆయన నివాసంలో కలిసినట్లు చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహకరించడంలేదని, సోదరి షర్మిల, తల్లి విజయమ్మ జగన్కు మద్దతుగా లేరని, వివేకా కుమార్తె సునీత కూడా వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబుకు వివరించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పాటు ప్రజలను కలవలేదని వివరించారు. రైతులకు బిందు పరికరాలు, ఇతరత్రా ఏమీ ఇవ్వలేదని, రైతులు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ఈ అంశాలన్నీ తెదేపా గెలుపునకు అనుకూలంగా ఉన్నాయని వివరించినట్లు చెప్పారు.