రాష్ట్రంలోని ఆదివాసీల ఆర్ధిక, విద్య, ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపరచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేశారని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. కుంభారవి బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా పెదకాకాని మండలం నంబూరు లోని ఎస్టీ కాలనీలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. కుంభారవి బాబు, కమిషన్ సభ్యులు శంకర్ నాయక్, మురళి, గుంటూరు ఆర్డిఓ ప్రభాకర రెడ్డి, ఇతర జిల్లా అధికారులతో కలసి సందర్శించారు.
తండాలోని నివాసాలను, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. కుంభారవి బాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ప్రధానంగా నివసించేది ఎరుకుల, యానాది, లంబాడి కులాలని, జిల్లాలో సుమారు 2 లక్షల 75 వేల మంది జనాభా ఉన్నారని, జిల్లాలో గిరిజన ప్రజానికానికి అవసరమైన కనీస మౌళిక సదుపాయాలు అధికారులు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. మా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని కమిషన్ సీరియస్ గా తీసుకుంటుందన్నారు. ప్రధానంగా పరిపాలన యంత్రాంగాన్ని కోరుతున్నది ఒకటేనని, 75 సంవత్సరాల స్వాతంత్ర్య దేశంలో గిరిజన ప్రజానికం రాజ్యంగ పరమైన హక్కులు కోల్పోయారని, లక్షల కోట్ల రూపాయలు భారత దేశంలో గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెడుతున్నా కూడా, ఆ ఫలాలు స్వీకరించడంలో, అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు.
దీనికి కారణాలు అనేకం వున్నాయని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలని ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగిందని, కాని ఎక్కడా సక్రమంగా అమలు చేసింది లేదన్నారు. రోస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా 20 సంవత్సరాలల్లో ఏ డిపార్టుమెంటు సక్రమంగా మెయింటెనెన్స్ చేయడం లేదని, రూల్ ఆఫ్ రిజ్వరేషన్ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. డానికి కారణం పరిపాలన యంత్రంగంలోని లోపాలని, దీని వలన గిరిజన ప్రజానికం ఆశించిన స్థాయిలో అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్ళడం లేదని, అలా జరుగకుండా ఉండడానికి ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. హక్కులు గిరిజనులకు అందుబాటులోకి రావాలని, ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల ఫలాలు గిరిజనులకు అందుబాటులోకి రావాలని, ఎక్కడైనా పొరపాటు, లోపాలు జరిగితే ముందుకు తీసుకువెళ్ళడానికి కమిషన్ పర్యవేక్షిస్తుందని, అవసరమైతే కమిషన్ కు ఉన్న ప్రత్యేకమైన జ్యూడిషియల్ అధికారాలతో అధికారులపై చర్యలు తీసుకోవడంలో కమిషన్ వెనుకాడదన్నారు.