లోకేశ్ మిడిమిడి జ్ఞానంతో విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రంలో క్రీడా వికాస కేంద్రాలను (కేవీకేలను) అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే కేవీకేలను గుట్టలు, శ్మశానాల్లో నిర్మించారని చెప్పారు. దొంగ అంచనాలతో రూ.కోటి ఖర్చయ్యే భవనాన్ని రూ.2 కోట్లతో, అదీ నాసిరకంగా నిర్మించి ప్రజా ధనాన్ని దోచేశారని తెలిపారు. చాలా చోట్ల కేవీకేలు ఊరికి దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు. ఓ అండ్ ఎం కింద ప్రైవేటు వ్యక్తులతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు న్యాయబద్ధంగా టెండర్లు పిలిచామన్నారు. పే అండ్ ప్లే విధానం గత ప్రభుత్వాల నుంచి ఉన్నదేనని చెప్పారు.