శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలం గుప్పెడుపేటలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. నందుపల్లి దాలమ్మ, బుడగట్ల పైడమ్మ, చెక్క ఎర్రమ్మకు చెందిన ఇళ్లతో పాటు వరుసగా ఉన్న 25 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.75 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. శుక్రవారం ఉదయం మత్స్యకారులు వేటకు వెళ్లిపోగా.. తమ పిల్లలను పాఠశాలలకు పంపించేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలు ఎగిసి పడ్డాయి. గ్రామస్థులు వెంటనే కోటబొమ్మాళి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈలోగా స్థానిక యువకులు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో బాధితులంతా నిరాశ్రయులయ్యారు.