పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజక వర్గంలో టీడీపీ కన్వీనర్ల ఎంపిక సమావేశంలో గొడవపడ్డారు. పరిశీలకుల ఎదుటే వాగ్వివాదాలు.. నినాదాలు.. కుర్చీలు విసురుకోవడం జరిగింది. కన్వీనర్ల ఎంపిక సమావేశంతో మరోసారి సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ శ్రేణుల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గంలోని మండల, పట్టణ కన్వీనర్ల ఎంపిక కోసం పట్టణంలోని ఎన్టీఆర్‌భవన్‌లో గురువారం కార్యకర్తల అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఆశిస్తున్న నాగోతు శౌరయ్య, మన్నెం శివనాగమల్లేశ్వరరావు, డాక్టర్ కోడెల శివరాంల నుంచి పరిశీలకులుగా వచ్చిన కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయులస్వామి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్, గర్నే వెంకటనారాయణప్రసాద్ అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు పరిశీలకుల వద్దకు వస్తున్న సమయంలో డాక్టర్ కోడెల శివరాం వర్గీయులు గొడవకు దిగారు. స్థానికుల నుంచే అభిప్రాయాలను సేకరించాలంటూ నినాదాలు చేశారు.