రష్యా సైనికులు వైదొలగడంతో ఉక్రెయిన్ లోని ఖెర్సొన్ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఉక్రెయిన్‌పై 8 నెలలకుపైగా కొనసాగుతున్న రష్యా దండయాత్ర కీలక మలుపు తిరిగింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సొన్ దాని పరిసర ప్రాంతాల నుంచి రష్యా సైన్యం వైదొలగింది. ఖెర్సొన్ నుంచి వైదొలగుతున్నట్లు రెండు రోజుల కిందట ప్రకటించిన రష్యా.. దీనికి అనుగుణంగా ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించింది. నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు మాస్కో రక్షణ శాఖ తెలిపింది. సైనికులతో పాటు ఆయుధ సామగ్రిని నిప్రో నది తూర్పు తీరంవైపు తరలించినట్లు పేర్కొంది.
ఈ పరిణామాన్ని ‘కీలక విజయం’గా ఉక్రెయిన్ అభివర్ణించింది. రష్యా సైన్యం వైదొలగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖెర్సోన్ నగరవ్యాప్తంగా ఉక్రెయిన్ జెండాలు వెలిసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖెర్సొన్ క్రమంగా తమ నియంత్రణలోకి వస్తోందని, సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. నగరంలో ఎవరైనా రష్యా సైనికులు ఉంటే.. వెంటనే లొంగిపోవాలని సూచించింది. మరోవైపు, ఇప్పటి వరకూ దాదాపు 41 ప్రాంతాలకు తమ సైన్యాలు విముక్తి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు.
ఇదిలావుంటే రష్యా బలగాలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో.. వాటిని తొలగించేందుకు నిపుణులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా.. ఖెర్సొన్ సమీపంలో ఉన్న మైకోలైవ్ నగరంలోని నివాసిత ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఖెర్సోన్ నుంచి రష్యా బలగాలు వైదొలగినా.. ఈ ప్రాంతంలో యుద్ధం ముగియలేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రాంతం నుంచి రష్యా సేనల ఉపసంహరణ అటు మాస్కో, ఇటు ఉక్రెయిన్‌కు సవాళ్లు విసిరే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
‘‘ఖెర్సొన్ యుద్ధం ముగియలేదు.. కానీ రష్యన్ దళాలు కొత్త దశలోకి ప్రవేశించాయి.. ఉక్రేనియన్ ఎదురుదాడిని పూర్తిగా ఆపడానికి ప్రయత్నించకుండా, మంచి క్రమంలో నదికి అవతలివైపునకు బలగాలను ఉపసంహరించుకున్నాయి’’ అని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ వ్యాఖ్యానించింది.
రష్యన్ బృందం నిప్రో నది మీదుగా ఉపసంహరించుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఉక్రేనియన్ ఒత్తిడితో మాస్కో దళాలు సాపేక్షంగా ఉపసంహరణను సక్రమ విధానంలో నిర్వహించగలవా అనేది అస్పష్టంగా ఉందని పేర్కొంది. బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఉపసంహరణ చాలా కష్టంతో కూడుకున్నదని అంగీకరించింది. ఉక్రేనియన్ దళాలు రష్యా ఆక్రమిత ఖెర్సొన్‌ను తిరిగి ఆక్రమించుకుని విముక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నందున ఆ ప్రయత్నంలో కూడా ప్రమాదాలు ఎదురవుతాయని అనుమానించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa