తిరుపతికి చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు రిమాండు ఖైదీగా ఉంటూ స్విమ్స్‌లో మరణించిన తీరు చర్చగా మారింది. ఇతడి మృతిపై అనేక సందేహాలను పాత్రికేయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాయి. జర్నలిస్టు శశిధర్ మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గవర్నర్‌కు లేఖ రాశారు. ఒక ఆంగ్ల దినపత్రికలో తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న బీఎం శశిధర్‌ను సెప్టెంబరు 19న ఎస్‌ఈబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 14.5 కిలోల గంజీయి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంటూ శశిధర్‌తో పాటూ, శివరాజు అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. బెయిల్ లభించక జైలులోనే ఉన్న శశిధర్ అనారోగ్యం క్షీణించిందంటూ ఈ నెల 3న చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమించడంతో 8న ఇన్‌పేషెంట్‌గా స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అదే రోజు ఉదయం 6.33 గంటలకు స్విమ్స్‌లో శశిధర్ మృతి చెందాడు.