ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ హిందూ ధర్మప్రచారం అద్భుతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 15, 2022, 02:15 PM

తిరుమల తిరుపతి దేవస్థానములు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేస్తోందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అభినందించారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గిరిజన , వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంతోపాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఆసేతు హిమాచలం బద్రీనాథ్ క్షేత్రం నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనివిధంగా తిరుమలలో ప్రతినిత్యం వేద ఘోష జరుగుతోందని చెప్పారు. ఇది మానవాళికి అత్యంత శ్రేయస్కరమన్నారు. విశాఖలోని రామకృష్ణ బీచ్ లో సోమవారం రాత్రి టిటిడి ఆధ్వర్యంలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహిక దీపారాధన చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వరుసగా మూడోసారి విశాఖలో కార్తీక మహాదీపోత్సవాన్ని టిటిడి నిర్వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. భక్తుల చెంతకు భగవంతుడు అన్న నినాదంతో దేశవ్యాప్తంగా వేంకటేశ్వర వైభవోత్సవాలు, శ్రీనివాస కల్యాణాలు, కార్తీకదీపోత్సవాలను టిటిడి నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రంగా మారనున్న విశాఖ నగరానికి శ్రీవారి అనుగ్రహం ఉండాలన్న కోరికతో స్థానిక ప్రజలు టిటిడిని సంప్రదించడం, వారు అంగీకరించడం సంతోషకరమన్నారు.

టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ , సుందర నగరమైన విశాఖపట్నంలో సాగర తీరాన ఆహ్లాదకర వాతావరణంలో వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో వరుసగా మూడోసారి కార్తీక మహాదీపోత్సవం నిర్వహించడం మనందరి అదృష్టమన్నారు.

కార్తీక దీపోత్సవం ఇలా.

విశాఖ సాగరతీరంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు ఫణియాజులు బృందం వేదస్వస్తి వినిపించారు. పండితులు డా. పివిఎన్ఎన్. మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. వేదస్వస్తి అనంతరం డా. మారుతి దీప ప్రాశస్యాన్ని తెలియజేశారు.    అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన నిర్వహించారు.   పండితులు విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చేశారు.

ఆకట్టుకున్న నృత్య రూపకం
కార్యక్రమంలో ప్రదర్శించిన దీపలక్ష్మీ నమోస్తుతే నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. దీపం ప్రాశస్యాన్ని కళ్ళకు కట్టేలా కళాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. దీప మంత్రం 9 సార్లు భక్తులతో పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. భక్తుల గోవిందనామ స్మరణతో విశాఖ సాగర తీరం మారుమోగింది. చివరగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.

టీటీడీ జెఈవో సదా భార్గవి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు , శేషాచల దీక్షితులు , మంత్రి అమర్నాథ్ , ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, అదీప్ రాజు , ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున , టీటీడీ సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్ , ఎస్వీబిసి సీఈవో షణ్ముఖ కుమార్ , మాజీ సీఈవో సురేష్ కుమార్ , దాతలు రాజేష్ , హిమాంశు ప్రసాద్ , కృష్ణప్రసాద్ బృందం కార్యక్రమ నోడల్ ఆఫీసర్లు ఎస్ ఈ 2 జగదీశ్వర రెడ్డి , డి ఈ రవిశంకర్ రెడ్డి , విజోవో మనోహర్ , డిఎఫ్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com