ఎన్నికల వ్యవస్థలో మార్పును సూచిస్తూ సరికొత్త వినూత్న ప్రతిపాదనను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కొన్ని మార్పులు తీసుకొస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసి సాధించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్నికల విషయంలో ఆయన చేసిన ప్రతిపాదనలు చర్చనీయాంశం అయ్యాయి.
‘'ఎన్నికల శంఖారావం' - నిజమైన ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంస్కరణలే పరమావధి. స్వచ్చమైన ఓటు సద్వినియోగం అవ్వడానికి కావలసిన ఎన్నికల సంస్కరణలకు నేటి నుంచే నడుం బిగిద్దాం. ప్రతిరోజూ మీ అభిప్రాయం కోసం ఒక సంస్కరణను సూచిస్తాము. వీటిని Supreme Court లో PIL ద్వారా సాధించే ప్రయత్నం చేద్దాము’అంటూ పిలుపునిచ్చారు లక్ష్మీనారాయణ
ఇందులో భాగంగా తొలి సంస్కరణను తెరపైకి తెచ్చారు. ‘సంస్కరణ - 1 ఒక ప్రజా ప్రతినిధి తన పదవీకాలం పూర్తయ్యేలోపు పదవికి రాజీనామా చేస్తే, ఎన్నికల్లో తదుపరి అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని మిగిలిన కాలానికి ప్రజా ప్రతినిధిగా ప్రకటించాలి’అంటూ వినూత్నమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.
లక్ష్మీనారాయణ ప్రతిపాదనలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సంస్కారవంతమైన సమాజంలో ఇది బానే ఉంటుందని.. కానీ గెలిచిన వారు ప్రతిపక్ష సభ్యులై, తదుపరి వారు అధికార పక్ష సభ్యులైన ప్రతిచోటా అధికారంలో ఉన్న వారు వారి సంఖ్యాబలం పెంచుకోడానికి రాజీనామాల ను కొనుగోలు చేసేస్తారు అంటూ కామెంట్ చేశారు. పార్టీ ఫిరాయింపు కంటే ఇది ఇంకా సులువైపోదూ.. దయచేసి ఆలోచించాలి అన్నారు. మంచి ఆలోచన.. అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉంటే తరువాత ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండకూడదు అలా అయితే తప్పకుండా ప్రజా సమస్యలు పరిష్కారం జరుగుతుంది అని మరొకరు తన అభిప్రాయాన్ని చెప్పారు.
ఈ సంస్కరణ ఎన్నికల ఖర్చు తగ్గడం కోసమా..లేక ఏదైనా ఇతర కారణం ఉందా అంటూ మరొకరు ప్రశ్నించారు. వాస్తవానికి ఎన్నికలు వస్తే విద్యావంతులు పోటీలో నిలబడే అవకాశం ఉంటుది కదా.. ఇలా చేస్తే ఆ నియోజక వర్గంలో ఇక ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండదు కదా అన్నారు. ఈ సంస్కరణ-1 బాగుంది.. కాకపోతే దీనివల్ల ప్రజాధనం కొంతమేరకు ఆదా అవుతుంది తప్ప.. ఎన్నికల వ్యవస్థలో పెద్దగా మార్పులేమి జరగవన్నారు. ముందుగా నేరచరితులను, తీవ్రమైన నేర అభియోగాలు ఉన్నవారిని (కోర్ట్ తీర్పు ఇచ్చేవరకు) ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా నిషేదించాలని తన అభిప్రాయాన్ని చెప్పారు. మరి లక్ష్మీనారాయణ తీసుకొచ్చిన సంస్కరణల ఆలోచన ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.