కొందరు తాను పుట్టిన కులాన్ని తిట్టి.. పదవులు సంపాదిస్తున్నారు అని టీడీపీ నేత వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదిగి.. ఇప్పుడు అదే కులాన్ని దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పుట్టిన కులాన్ని తిట్టి.. పదవులు సంపాదిస్తున్నారు. కులాన్ని పొగడకున్నా పరవాలేదు. కానీ.. తిట్టడం ఏంటీ. కులాన్ని తిట్టే వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలి. ప్రతీ మనిషి ఓ కులంలో పుడతారు. కులాన్ని అడ్డం పెట్టుకొని కొందరు పదవులు పొందితే.. రంగా మాత్రం ప్రజల కోసం పని చేశారు' అని రాధా వ్యాఖ్యానించారు.
'చేయి చేయి కలుపు.. చేజారదు గెలుపు అంటూ మూడున్నర దశాబ్దాల కిందట పెద్ద రాధా, రంగా పిలుపునిచ్చారు. దాన్ని మనం స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలి. ఎన్నిసార్లు గెలిచామన్నది ముఖ్యం కాదు.. ఒక్కసారి గెలిచినా ప్రజల మన్ననలు పొందాలి. రంగా మరణించే సమయం వరకు పుట్టనివారు కూడా.. ఇప్పుడు ఆయన్ను ఆరాధిస్తున్నారని.. అది ఆయన గొప్పదనం' అని రాధా వివరించారు. అయితే.. రాధా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ చర్చనీయాంశం అయ్యాయి. ఆయన ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది.