టీడీపీ నేత , మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరిపించి దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే కాకినాడ జిల్లా తునిలో.. తెలుగుదేశం పార్టీ నేతపై హత్యాయత్నం కలకలం రేపింది. మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యకు కుట్ర జరిగింది. భవానీ మాలధారణలో వచ్చిన వ్యక్తి.. శేషగిరి రావుపై దాడికి తెగబడ్డాడు. తన వెంట తెచ్చిన కత్తి బయటకు తీసి శేషగిరిరావుపై దాడి చేశాడు. ఆయన పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లోవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు అలెర్ట్ అయ్యారు. దీంతో దుండగుడు బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో శేషగిరి రావు చేతికి, తలకి బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
'ఫ్యాన్‌ను నమ్ముకుంటే లాభం లేదని కత్తిని నమ్ముకుంటున్నారు వైసీపీ నేతలు. సొంత బాబాయ్‌ని లేపేసిన వారు ఏ మాత్రం తగ్గకుండా అరాచకాలకు పాల్పడుతున్నారు. తునిలో టీడీపీ నేత పోల్నాటి శేషగిరిరావుపై గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మంత్రి దాడి శెట్టి రాజా అవినీతి, అక్రమాలపై పోరాడినందుకే శేషగిరిరావుని హత్య చెయ్యాలని కుట్ర పన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడికి పాల్పడిన రౌడీ మూకలతో పాటు వెనుక ఉన్న సైకోలని కూడా కఠినంగా శిక్షించాలి'. అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.