అప్పులపైనా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుతో పోలిస్తే తాము తక్కువే అప్పులు చేశామన్నారు. చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇక, గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చంద్రబాబు ప్రజల్నే బెదిరిస్తున్నారని విమర్శించారు. 2019లో ఓడించారుగా.. ఇంకా ఎందుకు రాజకీయాల్లో ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కర్నూలులో ఏమి మాట్లాడారో అర్థం కాలేదన్నారు. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, హరికృష్ణల జీవితాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు.
తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన అమరావతిలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాఠశాలలు మూసివేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి కోవిడ్ సమయంలోనూ కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 34 వేల ఉద్యోగాలు ఇస్తే తాము లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇక, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి బుగ్గన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానిలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. రాయలసీమలో కోర్టు పెడతామంటే వద్దంటున్నారని విమర్శించారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు.. కర్నూలుకు వచ్చే న్యాయ రాజధానిని అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. రాయలసీమకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.