కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అన్న విమర్శ తొలినుంచి ఉంది. ఇదిలావుంటే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. చెన్నై ఆఫీసులో మంగళవారం కార్యకర్తలు కొట్టుకున్నారు. రెండు వర్గాలకు చెందిన వారు ఒకరినొకరు కుమ్ముకున్నారు. దాంతో పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. అయితే గొడవ గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి... పార్టీ కార్యకర్తలకు సర్ది చెప్పారు.
తిరునల్వేలి జిల్లా స్థాయిలో పార్టీ కార్యకర్తల నియామకాలపై చెన్నైలోని సత్యమూర్తి భవన్ పార్టీ ఆఫీసులో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తిరునల్వేలి జిల్లా అధ్యక్షుడు కేబీకే జయకుమార్‌ను మార్చాలని పార్టీకి చెందిన పలువురు పట్టుబట్టారు. అయితే అక్కడే ఉన్న కేబీకే జయకుమార్ మద్దతుదారులతో వారితో గొడవపడ్డారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంపై చర్చించేందుకు పార్టీ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి హాజరయ్యారు. సమావేశం నుంచి బయటకు రాగానే అళగిరి కారును అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే గొడవ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికీ ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే కార్యకర్తలు ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.