సాంకేతికత పెరిగాక అంతా ఆన్ లైన్ వ్యాపారం కొనసాగుతోంది. అయితే ఇపుడు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేేస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్తగా నడుచుకోవాల్సిందే. మీరు కొత్త ఫోన్ కొంటున్నట్లయితే చార్జర్ అడాప్టర్ కోసం కూడా ఆర్డర్ చేయాల్సిందే. ఎందుకంటే మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త బాటలో నడుస్తున్నాయి. చార్జర్ లేకుండానే ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. యాపిల్, శామ్ సంగ్, గూగుల్ ఇప్పటికే ఫోన్లతో చార్జర్ ఇవ్వడం మానేశాయి. ఇప్పుడు వన్ ప్లస్, ఒప్పో కంపెనీలు కూడా ఫోన్ తో పాటు చార్జర్ ఇవ్వడాన్ని నిలిపివేయనున్నట్టు తెలిసింది.
కంపెనీలు అధికారికంగా ప్రకటించలేదు కానీ, విశ్వసనీయ సమాచారం ఆధారంగా టిప్ స్టర్ ముకుల్ శర్మ ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. యాపిల్ అన్ని రకాల ఫోన్లతో చార్జర్ ఇవ్వడాన్ని నిలిపివేసింది. శామ్ సంగ్ మాత్రం ఖరీదైన ఫోన్ల విషయంలో దీన్ని అమలు చేస్తుండగా, ఇప్పుడు మధ్య స్థాయి ధరల ఫోన్ల విషయంలోనూ ఇదే అమలు చేయబోతోంది. తక్కువ ఖరీదైన ఫోన్లకు చార్జర్ ను సరఫరా చేస్తూనే ఉంది.
ఇక వివో, ఐకూ, షావోమీ మాత్రం అన్ని రకాల ఫోన్లను చార్జర్ తోనే ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం రియల్ మీ నార్జో 50ఏ ఫోన్ ను చార్జర్ లేకుండా విక్రయించాలని నిర్ణయించడం గమనార్హం. పర్యావరణ అనుకూల కోణంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఫోన్ తయారీ కంపెనీలు సమర్థించుకుంటున్నాయి. కానీ, దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం అయితే పడుతుంది. అప్పటికే చార్జర్ ఉన్నవారికి ఇబ్బంది లేదు. చార్జర్ లేని వారు మాత్రం అదనంగా వెచ్చించి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి.