పోలీసులకు హ్యాండ్ బుక్ విషయంలో వివాదం చెలరేగడంతో కేరళ సర్కార్ కాస్త వెనక్కి తగ్గింది. సుదీర్ఘ మండల-మకరవిలక్కు పూజల కోసం బుధవారం సాయంత్రం శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరుచుకోగా.. గురువారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే, సన్నిధానం వద్ద విధులు నిర్వహించే పోలీసుల కోసం కేరళ ప్రభుత్వం ముద్రించిన హ్యాండ్‌బుక్‌పై తీవ్ర దుమారం రేగింది. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ హ్యాండ్‌బుక్‌ను ఉపసంహరించుకుంది. ఆలయంలోకి భక్తులను అనుమతించే విషయంలో భద్రతా సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలను తెలియజేయడం కోసం కేరళ హోంశాఖ ఈ పుస్తకాన్ని ముద్రించింది.
‘సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పు ప్రకారం భక్తులందరికీ అయ్యప్ప ఆలయంలో ప్రవేశార్హత ఉంటుంద’ని ఓ నిబంధనగా పేర్కొంది. అన్ని వయసుల మహిళలకు అనుమతి విషయాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా.. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ‘అందరికీ ప్రవేశం’ సూచనను చేసిందని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. దీనిపై తక్షణమే స్పందించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశంలేదని, పాత పుస్తకాన్ని యథాతథంగా తిరిగి ముద్రించడం వల్ల ఇలా జరిగిందన్నారు. అనుమానాలకు తావిచ్చేలా ఉన్న ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు.
లోపాలను సవరించి కొత్త హ్యాండ్ బుక్‌ను ముద్రించి పోలీసులకు అందజేస్తామని కేరళ అదనపు డీజీపీ ఎం.ఆర్ .అజిత్ కుమార్ వెల్లడించారు. ఈ వివాదంపై కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ మాట్లాడుతూ.. శబరిమలను మళ్లీ యుద్ధభూమిగా మార్చాలని, అయ్యప్ప భక్తులను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తే మేము ఏమీ మరచిపోలేదు. ఆ విషయాల నుంచి ప్రభుత్వం గతంలోనే వెనక్కి తగ్గింది.. మీరు మళ్లీ అలాంటి ఎత్తుగడలతో ముందుకు వస్తే అది చాలా విస్తృతమైన పరిణామాలను దారితీస్తుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గురువారం ఉదయం దర్శనాలు ప్రారంభంకాగా.. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక భక్తులు పోటెత్తారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ 2018 సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. సుప్రీం తీర్పుపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.