కొన్ని సందర్భాలలో చట్టబద్దంగా వ్యవహరించాల్సిన అధికార్లు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని వివాదాలకు కారణమవుతుంటారు. అలాంటి ఘటనే యూపీలో చోటుచేసుకొంది. కదులుతున్న రైలు నుంచి ఓ సైనికుడ్ని టీటీఈ కిందకు తోసేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జంక్షన్‌లో గురువారం చోటుచేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతున్న జవాన్ సోను కుమార్‌ను టీటీఈ కిందకు తోసేశాడు. ఈ ఘటనలో సోను కుమార్ రెండు కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గురించి తెలిసి కోపోద్రిక్తులైన ఇతర జవాన్లు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి వేసి, టీటీఈను చితకబాదారు. తీవ్రగాయాలైన సోను కుమార్‌కు వైద్యులు రెండు కాళ్లను తొలగించారు.
డిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను లక్నో స్టేషన్‌లో ఎక్కిన జవాను సోను కుమార్.. బరేలీ స్టేషన్‌లో రైలు ఆగడంతో మంచినీళ్ల కోసం కిందికి దిగాడు. ఆలోపే రైలు కదలడంతో పరుగెత్తుకుంటూ ఎక్కడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న టీటీఈ సుపన్ బోరే, అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోను కుమార్‌ను టీటీఈ కిందకు నెట్టేశాడు. దీంతో రైలు, ప్లాట్‌ఫామ్‌కి మధ్య సోను పడిపోవడంతో రెండు కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. దీనిని గమనించి తోటి జవాన్లు.. టీటీఈకి దేహశుద్ధి చేశారు.
ఈ విషయం తెలిసి రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకుని జవాన్లనకు నచ్చజెప్పారు. ఈ సంఘటనతో రాజధాని ఎక్స్‌ప్రెస్ బరేలీ స్టేషన్‌లో గంటపాటు నిలిచిపోయింది. ‘నేను రైలు ఎక్కబోతుంటే టీటీఈ అడ్డుకున్నాడు.. నన్ను దుర్భాషలాడడమే కాకుండా రైలు లోంచి నన్ను కిందకి తోసేశాడు. దాంతో, నా రెండు కాళ్లు పోయాయి’’ అని సోను కుమార్ కన్నీటిపర్యంతమయ్యాడు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. సుపన్ బోరేపై హత్యాయత్నం కేసు పెట్టారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఏం జరిగిందనేది తెలుసుకోడానికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని ఉత్తర రైల్వే పరిధి మొరాదాబాద్ డివిజన్ సీనియర్ ఫైనాన్స్ మేనేజర్ అన్నారు. టిక్కెట్ విషయంలోనే సోను, బోరే మధ్య వాగ్వాదం జరిగినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.