నేటి సమాజంలో తిండి అయినా లేకుండా ఉంటారేమో గానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేరు. మరీ ముఖ్యంగా పిల్లలు..టీనేజీలు. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఊళ్లో ఉండే 18 ఏళ్లలోపువారు మొబైల్ ఫోన్ వాడకుండా బ్యాన్ విధించింది. యవత్మాల్ జిల్లా బన్సీ గ్రామంలో దీనిని అమలు చేస్తున్నారు. పిల్లలు, టీనేజర్లు మొబైల్ ఫోన్‌కి బానిసలవుతున్నారని, అందుకే పిల్లల ఫోన్లపై వాడకంపై నిషేధం విధించామని గ్రామ సర్పంచ్ గజానన్ చెప్పారు.
ఈ మేరకు ఓ తీర్మానాన్ని నవంబర్ 11న గ్రామ సభలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు సర్పంచ్ చెప్పారు. కోవిడ్ సమయంలో పిల్లలు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి, ఫోన్‌లను ఉపయోగించడం బాగా అలవాటు చేసుకున్నారని సర్పంచ్ గజానన్ అన్నారు. అందుకే పిల్లలను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల నుంచి తప్పించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు ఆయన చెప్పారు. "ఈ నిర్ణయం అమలు చేయడం కష్టమని మాకు తెలుసు, అయితే మేము మొదట్లో కౌన్సెలింగ్ ద్వారా సవాళ్లను పరిష్కరిస్తాం. మొబైల్ వాడుతున్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే వారిపై రూ.200 జరిమానా విధిస్తాం." అని సర్పంచ్ గజానన్ అన్నారు.
ఈ నిర్ణయాన్ని గ్రామ విద్యార్థులు కూడా ఆహ్వానిస్తున్నారు. మంచి అలవాట్లను పెంపొందించడానికి ఇది మంచి నిర్ణయమని గ్రామంలోని విద్యార్థి ఆశిష్ దేశ్‌ముఖ్ అన్నారు. అలాగే గ్రామంలో తల్లిదండ్రులు కూడా మద్దతు ఇచ్చారు. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని వాళ్లు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి గ్రామ పంచాయతీగా బన్సి నిలిచింది.