భిన్నమతాలు, కులాలున్న మనదేశంలో ఆచార వ్యవహారాలు కూడా అనే విభిన్న రూపాల్లో ఉన్నాయి. ఆలయాల్లో దేవుళ్లకు, దేవతలకు భక్తులు నైవేద్యంగా రకరకాల స్వీట్లు, వంటకాలు చేసి పెడుతుంటారు. కొబ్బరికాయలు కొడుతుంటారు. దీపాలు పెడతారు. అగరబత్తులు వెలిగిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయంలో మాత్రం విభిన్నమైన ఆచారం ఉనికిలో ఉంది. దానికనుగుణంగా ఓ భక్తుడు ఆ గుడిలో దేవుడికి సిగరెట్లు, మద్యం నైవేద్యంగా అందించి... భక్తిని చాటుకున్నాడు. ఉజ్జయినిలోని భాగ్తిపురలో ఉన్న ఆలయంలోని భైరవనాథుడికి ఓ భక్తుడు మద్యం, సిగరెట్‌లతో సహా 1,351 రకాల స్వీట్లు, వంటకాలు పండ్లు, ఫలాలను కూడా సమర్పించాడు.
అక్కడి కాలభైరవ దేవాలయంలో భక్తులు వివిధ రకాల వంటలని, మద్యాన్ని అందించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. భక్తులు మొదట ఆలయంలో భైరవనాథునికి నైవేద్యాన్ని పెట్టి తర్వాత వాటిని పంపిణీ చేస్తారు. అంతేకాదు భక్తులు భైరవ అష్టమిని వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం కూడా భైరవ్ బాబాను ఆకర్షణీయంగా అలంకరించారు. విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ భక్తుడు దేవుడికి 1,351 రకాల వంటకాలను సమర్పించారు. అందులో వివిధ రకాల మద్యం, సిగరెట్లు కూడా ఉన్నాయి.
భక్తుడు సమర్పించిన వాటిలో 390 రకాల అగరబత్తులు, 180 రకాల ఫేస్ మాస్క్‌లు, 75 రకాల డ్రై ఫ్రూట్స్, 64 రకాల చాక్లెట్లు, 60 రకాల గుజరాతీ నమ్‌కీన్‌లు, 60 రకాల సిగరెట్లు, 56 రకాల స్నాక్స్, 55 రకాల స్వీట్లు, 45 బిస్కెట్లు, 40 రకాల మద్యం, గంజాయి, 40 రకాల బేకరీ వస్తువులు, 28 రకాల డ్రింకులు, 28 రకాల పండ్లు తదితరాలు ఉన్నాయి. భైరవనాథుని పూజించిన తర్వాత భక్తుల కోరికలు నెరవేరుతాయని స్థానికుల విశ్వాసం.