జై జవాన్...జై కిసాన్ అని గర్వంగా చెప్పుకొంటాం. కానీ ఓ సైనికుడికి మాత్రం న్యాయం దాదాపు 28 ఏళ్ల తరువాత దక్కింది. దేశ కోసం పోరాడిన ఓ జవాన్... దేశ సరిహద్దులో కాపాలా చేసి.. తన పూర్వీకులు ఇచ్చిన భూమిని దక్కించుకోవడానికి మూడు దశాబ్దాలు న్యాయ పోరాటం చేశాడు. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత ఆ భూమిని సొంతం చేసుకున్నాడు. కర్ణాటకలోని దక్షిణ కర్ణాటక జిల్లా బంట్వాల్ తాలూకాలోని విట్టల్‌పడనూర్‌కు చెందిన దివానా గోపాలకృష్ణ భట్ భారత సైన్యంలో పనిచేశారు. తర్వాత రిటైర్మెంట్ పొందారు.
దేశం కోసం అన్నేళ్లు పోరాటం చేసిన గోపాలకృష్ణ భట్.. పదవీ విరమణ తర్వాత కూడా పోరాడక తప్పలేదు. తన పూర్వీకులు ద్వారా పొందిన భూమి.. వేరేవాళ్లు సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. దాంతో గోపాలకృష్ణ భట్.. కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆ కేసు విచారణ ఒకటి కాదు.. రెండు కాదు 28 ఏళ్లు సాగింది. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసులో హైకోర్టు ఫైనల్‌గా తీర్పునిచ్చింది. ఈ మేరకు 6.6 ఎకరాల వ్యవసాయ భూమిని యజమానికి తిరిగి ఇవ్వాలని కౌలుదారుడిని హైకోర్టు సూచించింది. ఎనిమిది వారాల్లోగా అప్పగించాలని, లేకపోతే బలవంతంగా ఖాళీ చేయించాలని సంబంధిత అధికారులకు కోర్టు సూచించింది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ గోపాల్ కృష్ణ భట్ గురించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన భూమిని దక్కించుకోవడానికి ఆయన దశాబ్దాలుగా పోరాడుతున్నారని న్యాయస్థానం పేర్కొంది. తన జీవితం మొత్తం దేశాన్ని కాపాడిన ఓ సైనికుడు... తన జీవిత చరమాంకంలో ఇలా పోరాడుతుంటే ప్రస్తుతం సర్వీసులో ఉన్న జవాన్‌లు ఏమనుకుంటారో ఊహించుకోవచ్చని న్యాయమూర్తి అన్నారు.