హాస్టళ్లు.. అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతపై ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు-నేడు పనులపై జగన్ సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో 3వేల 13 చోట్ల పనులు చేపట్టాలని సూచించారు. తొలి విడతలో 1,366 చోట్ల పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
హాస్టళ్లలో నాడు-నేడు పనులకు రూ.3,364 కోట్లు ఖర్చు అవుతుందని.. తొలి విడత పనుల కోసం రూ.1500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి జగన్ అధికారులకు వివరించారు. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. కర్నూలులోని హాస్టళ్లను బాగుచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్, గిరిజన గురుకులాల్లో 171 హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్-4 పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు.