బీసీసీఐ తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకొని సెలక్ట్ కమిటీకి షాక్ ఇచ్చింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాజయం చవిచూడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా సెలెక్షన్ కమిటీ మొత్తంపైనా వేటు వేసింది.
అంతేకాదు, వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావలెను అంటూ బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకోసం కొన్ని అర్హతలు కూడా నిర్దేశించింది. కనీసం 7 టెస్టు మ్యాచ్ లు కానీ, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కానీ, లేక 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన వారు కూడా అర్హులు అని వివరించింది. ఆట నుంచి ఐదేళ్ల కిందటే రిటైరై ఉండాలని పేర్కొంది. మరే ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండరాదని తెలిపింది. నవంబరు 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ స్పష్టం చేసింది.