వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా కొట్టుకుపోయింది. రోజు విరామం తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో టీ20కి ఆతిథ్య న్యూజిలాండ్, భారత్ జట్లు సిద్ధమయ్యాయి. రెండో టీ20 ఆదివారం మౌంట్ మాంగనూయ్‌లో జరగనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో గెలిచి మూడు టీ20ల సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు, DD స్పోర్ట్స్ ఛానెల్‌లు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. తొలి టీ20 జరగకపోవడంతో రెండో టీ20లో జట్టు మార్పుల గురించి చెప్పడం కష్టమే. తొలి టీ20 టాస్ పడిపోకుండా రద్దయింది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో ఆడాలనుకున్న జట్టుతోనే రెండో టీ20లోనూ టీమిండియా ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్, పేసర్ ఉమ్రాన్ మాలిక్‌లకు నిరాశ తప్పదు. హార్దిక్ పాండ్యా ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్‌ను ఓపెనర్‌గా పంపితే మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కనుంది. వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్ స్పిన్నర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది.