అందరి ఊహలకు తగ్గటే ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కళ్లు చెదిరే లేజర్ లైటింగ్ షోలు, అరబిక్, పాశ్చాత్య సంగీతాలకు అనుగుణంగా నృత్యాలతో ఇక్కడి అల్ బేత్ స్టేడియం జిగేల్మంది. కొరియన్ సంగీత బృందం బీటీఎస్ కు చెందిన జంగ్ కూక్ కూడా వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీలో తన పెర్ఫార్మెన్స్ తో ఉర్రూతలూగించాడు. ఖతార్ గాయకుడు ఫహాద్ అల్ కుబైసీతో కలిసి జంగ్ కూక్ టోర్నమెంట్ గీతాన్ని ఆలపించాడు.
ఇక హాలీవుడ్ లెజెండ్ మోర్గాన్ ఫ్రీమన్ స్టేడియం మధ్యలోకి వచ్చి ప్రపంచ ఐక్యతను చాటేలా స్ఫూర్తిదాయక వచనాలను పలికారు. ఈ మెగా టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ పోటీల్లో పాల్గొనే 32 జట్ల జాతీయ పతాకాలను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ దేశాల అధినేతలు కూడా హాజరయ్యారు. కాగా, టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య ఖతార్ తో ఈక్వెడార్ తలపడనుంది.