పుట్టపర్తి: స్వార్థ ప్రయోజనాలు వ్యక్తిగత లబ్ధి కోసమే మూడు రాజధానులను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని స్థానిక శాసనసభ్యుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విమర్శించారు. వైసీపీ స్థానిక కార్యాలయంలో ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు, కర్నూలు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌ను. పోలీసులను దూషించడం సరికాదన్నారు. ఆనాడే వికేంద్రీకరణ జరిగి ఉంటే ఏపీ విడిపోయేదే కాదన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకోన్నాడన్నారు. అమరావతిలో భూములు కొన్నందునే అక్కడే రాజధాని కావాలని బాబు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికలలో మూడు రాజధానులపైనే రెపరెండంగా తీసుకొనుటకు తాము సిద్ధమని ఇందుకు చంద్రబాబు సిద్ధమేనా అని సవాలు విసిరారు. రాయలసీమ వాసిగా చంద్రబాబు కర్నూలులో న్యాయ రాజధానిని వ్యతిరేకించడం వల్ల సీమ ద్రోహిగా నిలుస్తాడన్నారు. శ్రీ బాగ్ వడంబడిక అమలు చేయాల్సిందేనని వికేంద్రీకరణకు ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని అన్నారు. సత్యసాయి జయంతి వేడుకలకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కూడా కేటాయించామన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ పట్టణ గ్రామీణ కన్వీనర్లు రంగారెడ్డి, నర్సారెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబుళపతి, వైస్ చైర్మన్ శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి, గంగాద్రి, మాధవప్ప తదితరులు పాల్గొన్నారు.