సమాజం ఎంతో పురోగతి సాధిస్తున్న పరువు హత్యలు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఇలాంటి ఘటనే యూపీలో చోటు చేసుకొంది. ఉత్తరప్రదేశ్ లో ఓ తండ్రే తన కుమార్తెను కిరాతకంగా హత్య చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. గత వారం మధురలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలో సర్వీసు రోడ్డు పక్కన ఓ సూట్ కేసులో అమ్మాయి శవం కనిపించింది. కొందరు కార్మికులు ఆ సూట్ కేసును గమనించి దగ్గరికి వెళ్లగా, రక్తపు మరకలు ఉండడంతో భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది హత్య కేసుగా అంచనాకు వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ అమ్మాయి పేరు ఆయుషి చౌదరి కాగా, తండ్రి చేతిలో హత్యకు గురైనట్టు తేలింది.
మరో సామాజిక వర్గానికి చెందిన ఛాత్రపాల్ అనే యువకుడ్ని ప్రేమించి వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె తండ్రి నితీష్ యాదవ్ తుపాకీతో కాల్చి చంపాడు. ఆపై భార్యసాయంతో కుమార్తె మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కుక్కి యమునా ఎక్స్ ప్రెస్ హైవే వద్ద విసిరేశారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజితో పాటు ఫోన్ డేటాను పరిశీలించి తండ్రి నితీష్ యాదవ్ ను హంతకుడిగా నిర్ధారించారు. అతడి నుంచి లైసెన్స్ డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇది పరువు హత్య అని భావిస్తున్నారు.