రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఎన్ని భూములు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు స్థాపించారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో జరిపిన భూ కేటాయింపుల వివరాలు వెల్లడించాలని స్పష్టం చేశారు. భూములు కేటాయించిన తర్వాత పరిశ్రమల ప్రారంభం ఎందుకు జరగలేదు? అనే విషయాలపై ప్రభుత్వం ఏనాడైనా సమీక్ష జరిపిందా? అనే విషయాలు ప్రజలకు ఎందుకు వివరించడంలేదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి అనేక ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించిన భూములు కబ్జాలకు గురవుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయని విమర్శించారు. అధికార పార్టీ నేతలే కబ్జాదారులన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఆయా పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతూ తమ లేఖల్లో ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయని వివరించారు. వీటన్నింటిపై ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా వివరణ ఇవ్వాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
అంతేకాదు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో, రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు ఆయా కాంట్రాక్టర్ల కార్యక్రమాలకు అడ్డుపడడం, వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయని సోము వీర్రాజు వివరించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మీ ప్రభుత్వం అడ్డుపడుతోందని అనేక ఉదాహరణలు బయటికి వస్తున్నాయని తెలిపారు. జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి కారణం ఎవరో చెప్పాలని, బెదిరింపులకు పాల్పడుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వివరించాలని డిమాండ్ చేశారు.