గిరిజనులకు న్యాయం చేయలేని పదవులు ఎందుకని.. తక్షణం అధికార పార్టీ గిరిజన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం సీతంపేట ఐటీడీఏ ఎదుట ఆదివాసీలు నిరసన తెలిపారు. మన్యం ర్యాలీ పేరిట వారపు సంత నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకుడు బిడ్డిక తేజేశ్వరరావు, పాలకొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ వైసీపీ సర్కారు గిరిజనుల హక్కులను కాలరాస్తోందన్నారు. బోయి, వాల్మీకి, మత్స్యకారులు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతున్నట్టు జీవో జారీచేయడం దారుణమన్నారు. జేసీ ఆనంద్‌శర్మ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సీతంపేటలో ఐటీడీఏను కొనసాగించాలని కోరారు. తరలిస్తే మాత్రం తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అనంతరం ఐటీడీఏ పీవో నవ్యకు వినతిపత్రం అందజేశారు. పాలకొండ సీఐ త్రినాధరావు, సీతంపేట ఎస్‌ఐ నీలకంఠేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ధర్నాలో పడాల భూదేవి, గేదెల రవి, హిమరిక ప్రసాద్, తోట ముఖలింగం, హెచ్ .మోహన్‌రావు, బిడ్డిక అప్పారావు, ఉమామహేశ్వరరావు, వెంకునాయుడు, మూటక శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.