తాజాగా ఇండోనేషియాలో చోటు చేసుకొన్న భూకంపం స్థానికంగా తీవ్ర విషాధాన్ని నింపింది. ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావా పశ్చిమ భాగంలో నిన్న సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 268కి పెరిగింది. సియాంజుర్ పట్టణానికి సమీపంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు రాగా, భారీ నష్టం వాటిల్లింది. తొలుత 44 మంది మరణించారని అధికారులు చెప్పగా, నేటికి ఆ సంఖ్య మరింత పెరిగింది.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, శిథిలాల కింద మృతదేహాలు ఉండొచ్చని, మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు. ఇంకా 151 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఇండోనేషియా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ భూకంపం సృష్టించిన విధ్వంసంలో 1000 మంది వరకు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న సిబ్బంది మాట్లాడుతూ, ఈ భూకంపం వల్ల మరణించినవారిలో అత్యధికులు చిన్నారులేనని వెల్లడించారు. విద్యార్థులు స్కూల్లో ఉండగా భూకంపం సంభవించడంతో తీవ్ర ప్రాణనష్టం జరిగినట్టు భావిస్తున్నారు.