ఇళ్లు అద్దెకిస్తానని చెప్పి భారత జట్టు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చిక్కుల్లోపడ్డాడు. విషయం ఏంటంటే... యువరాజ్ సింగ్ కు గోవాలోని మోర్జిమ్ లో ఓ విలాసవంతమైన భవంతి ఉంది. ఈ భవనం పేరు 'కాసా సింగ్'. ఈ విల్లాను పర్యాటకులకు అద్దెకు ఇస్తానని యువీ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఇచ్చాడు. ఒక విధంగా ఇది పేయింగ్ గెస్ట్ విధానం కిందికి వస్తుంది.
అయితే, పేయింగ్ గెస్ట్ విధానంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్-1982 ప్రకారం నమోదు చేయించుకోవాలి. అయితే యువరాజ్ ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే, ఇంటిని గెస్టుల కోసం అద్దెకు ఇస్తామని ప్రకటన ఇవ్వడంపై గోవా అధికార వర్గాలు స్పందించాయి. టూరిజం నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అద్దెకు ఇస్తామని ప్రకటించడం నిబంధనలకు వ్యతిరేకం అని, అందుకు రూ.1 లక్ష జరిమానా విధిస్తున్నట్టు గోవా టూరిజం శాఖ వెల్లడించింది.
హోటల్ అయినా, గెస్ట్ హౌస్ అయినా, విల్లా అయినా అతిథ్య కార్యకలాపాలు నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. నోటీసులకు డిసెంబరు 8న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని యువరాజ్ సింగ్ ను ఆదేశించింది.