వైసీపీ మూడున్నరేళ్ల పాలనపై జగన్ వీరాభిమానులే అసంతృప్తిలో ఉన్నారు. జిల్లాలో రాజశేఖర్‌రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి, జగన్‌పాలనలో జరిగిన అభివృద్ధి పోల్చుకుంటూ వైసీపీ శ్రేణులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు భూములను, ఇసుకను కొల్లగొట్టి పేదల కడుపు కొడుతున్నారు. జగన్ పాలనపై ఉన్న అసంతృప్తిని సీఎం జిల్లాలో ప్రతిపక్ష హోదాలో టీడీపీ క్యాచ్ చేసుకోవాల్సి ఉంది. కేవలం కొందరు షోకుల రాయుళ్లుగా మారి ప్రెస్‌మీట్లకే పరిమితమవుతున్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చే కార్యక్రమాలు తప్ప స్థానికంగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టలేదు. నిజం చెప్పాలంటే మొద్దునిద్రలో ఉన్నారు. పసుపు జెండా అంటే ప్రాణమిచ్చే అసలు సిసలు కార్యకర్తలే కొందరు ఇన్‌చార్జిలు, జిల్లా నేతల తీరు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో చంద్రబాబు పర్యటన సక్సెస్ కావడం వీరిలో ఉత్తేజాన్ని నింపింది. వచ్చే ఎన్నికల్లో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు తగ్గట్లుగా పైస్థాయి నాయకులు లేరంటూ వీరు వాపోతున్నారు.