వజీరాబాద్ లో తనపై జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు షూటర్లు పాల్గొన్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ పై ఇటీవల హత్యాయత్నం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. బుల్లెట్ గాయాల నుంచి కోలుకున్న ఆయన ఓ సభలో ప్రసంగిస్తూ ఆనాటి ఘటనను వివరించారు.
"మొదట ఇద్దరు షూటర్లు కనిపించారు. వారిలో ఒక షూటర్ నాపై కాల్పులు జరిపాడు. రెండో షూటర్ పీటీఐ నేతలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఇక మూడో షూటర్... నాపై కాల్పులు జరిపిన తొలి షూటర్ ను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ మూడో షూటర్ ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తిని బలిగొన్నాడు" అని వివరించారు. ఇదిలాీవుంటే తనపై హత్యాయత్నం వెనుక ప్రధాని షెహబాజ్ షరీఫ్, హోంమంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి మేజర్ జనరల్ ఫైజల్ నజీర్ ఉన్నారని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.