రాష్ట్రంలో మార్గదర్శి చిట్స్‌లో ఆర్థిక లావాదేవీలపై జరిపిన ప్రాథమిక తనిఖీల్లో కొన్ని సందేహాలు, ఆర్థిక ఉల్లంఘనలు ఉన్నందున తదుపరి సమగ్ర విచారణ కోసం ఆ సంస్థకు వారం పది రోజుల్లో షోకాజు నోటీసులు ఇస్తామని రాష్ట్ర స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఆ సంస్థ ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయన్నారు. మార్గదర్శి చిట్స్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సహకారంతో అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మార్గదర్శి కార్యకలాపాల్లో నిధుల మళ్లింపు, ఇతర అంశాలపై అనుమానాలు ఉన్నాయని.. చిట్ వేసే వారి నుంచి తీసుకునే సొమ్ము వాటికి మాత్రమే వినియోగించాలని.. కానీ ఆ సొమ్ము వేరే వాటికి మళ్లించినట్లు గుర్తించామని తెలిపారు. ప్రత్యేక ఆడిటింగ్‌కు సిద్ధమవుతున్నామని.. ఫోర్సెనిక్ ఆడిటింగ్ నిర్వహిస్తామన్నారు.