కొంతమంది భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని నడుచుకుంటారు. అలంటి వారిలో ఒకరుగా వీరిని చెప్పవచ్చు . భార్య కోరిక మేరకు భర్త వ్యాన్‌పై రుమేనియా నుంచి ప్రపంచయాత్రకు శ్రీకారం చుట్టాడు. రుమేనియాకి చెందిన పీటర్, వోల్గాన్ దంపతలు. వోల్గాన్‌కు ఎప్పటినుంచో భారతదేశాన్ని చూడాలనే కోరిక ఉంది. అలాగే ప్రపంచయాత్రపైనా మక్కువ ఉండటంతో ఆ దంపతులిద్దరూ వరల్డ్ టూర్‌కు ప్లాన్ చేసుకున్నారు. యాత్రకు సమాయత్తమవుతుండగా వారికి పాప పుట్టింది. ఆ చిన్నారిని స్కూల్‌లో చేర్పించేలోగా ప్రపంచమంతా చుట్టి వచ్చేద్దామని వారు నిర్ణయించుకున్నారు. సుమారు 9 నెలల క్రితం రుమేనియా నుంచి బయల్దేరిన పీటర్, వోల్గాన్ ఇప్పటివరకు వ్యాన్‌పై 20 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. పలు ప్రాంతాలు సందర్శిస్తూ ఆదివారం సాయంత్రం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం చేరుకున్నారు. యండపల్లి జంక్షన్‌లోని చెలికాని ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకుడు జగదీశ్ వారికి రాత్రికి బస ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీటర్ దంపతులు మాట్లాడుతూ.. భారత్‌లోని సంస్కృతి, సంప్రదాయాల పట్ల తామెంతో ఆకర్షితులయ్యామని చెప్పారు.