కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సాక్షిగా విచారిస్తే త్వరగా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. న్యాయం చేయడమే కాదు.. న్యాయం చేసినట్లు కనిపించాలన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని విచారించకపోతే కొన్ని అనుమానాలు చరిత్రపుటల్లో అలాగే నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేయడం హర్షించదగ్గ పరిణామమన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి గుండె పోటుతో మరణించారని మీడియాకు చెప్పిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని, ఈ హత్య కేసులో అనుమానితుడిగా పేర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవాల్సిందేనని ఎంపీ రఘురామ కృష్ణరాజు కోరారు. సీబీఐ అధికారి రాంసింగ్ స్వేచ్ఛగా హైదరాబాద్‌కు వెళ్లి ఈ హత్య కేసును విచారించవచ్చని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయం ఆయనకు ఉండేదని పేర్కొన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందో అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందే ఎలా ఊహించి మీడియాకు వివరించారని ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అని నిలదీశారు. తన బాబాయి హత్య ఎలా జరిగిందో జగన్మోహన్ రెడ్డి ముందే తెలుసుకున్నారా? లేకపోతే హత్య జరిగిన తీరు గురించి ఆయనకు ఎవరైనా చెప్పారా అని సూటిగా ప్రశ్నించారు.
అసెంబ్లీలో హత్యోదంతంపై మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనుమానితులను వెనుకేసుకొచ్చే విధంగా మాట్లాడారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. వివేకా హత్య కేసులో నిందితులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని చెప్పాల్సిన ముఖ్యమంత్రి... శివ శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు తనకు రెండు కళ్లు అని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన్ని సీఎం జగన్‌ను సాక్షిలా పిలిచి విచారించాలని సీబీఐని కోరారు.
మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ... ఇకపై వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఇందులో కుట్ర కోణం దాగి ఉందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసును ఇంకా లోతుగా విచారించాలని కోరారు.
వైఎస్ వివేకానంద రెడ్డి భార్య, కుమార్తెలు న్యాయం కోసం సుప్రీం కోర్టు వరకు రావడం కలిచివేసిందని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి.. న్యాయం చేయడమే కాదని, న్యాయం జరిగినట్లుగా కనిపించాలని అన్నారని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేయడం వల్లే ఈ కేసు విచారణలో జాప్యం జరిగిందన్నారు. డాక్టర్ సునీత కోరిక మేరకు హత్య కేసు విచారణను హైదరాబాద్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించిందని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఆయన కుమార్తె డాక్టర్ సునీత చేసిన పోరాటానికి దక్కిన విజయమని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. సునీత స్ఫూర్తితో ప్రజలు, మహిళల్లో కూడా పోరాడాలనే ధైర్యం వస్తుందన్నారు. డాక్టర్ సునీత ప్రజా జీవితంలోకి వస్తే బాగుంటుందని సూచించారు. ప్రజా జీవితంలో అడుగుపెట్టే విషయమై ఆమె ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa