వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చే సీట్లు సున్నా అంటూ ఏపీ మంత్రి ఆర్. కే.రోజా జోస్యం చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇకనైనా మారితే బావుటుందన్న మంత్రి.. ఇద్దర్ని చూసి రాష్ట్రంలో ప్రజలు ఇదేం కర్మరా బాబూ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల తర్వాత ఏం చేశారో పవన్ కళ్యాణ్ 2024 తర్వాత కూడా అదే చెయ్యాలన్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితను రెండు నియోజకవర్గాల్లో ప్రజలు చీత్కరించారన్నారు. తనను మాత్రం 12 ఏళ్లగా నగరి ప్రజలు ఆశీర్వదించారన్నారు.
రాజధాని విషయంలో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు తర్వాతైనా అడ్డమైన యాత్రలు ఇకనైనా మానెయ్యాలన్నారు మంత్రి రోజా సుప్రీం కోర్టు తీర్పు తర్వాతైనా రైతులు అమరావతి - అరసవెల్లి పాదయాత్రను ఆపేయాలని.. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
అమరావతి పేరుతో చంద్రబాబు బినామీలతో కట్టుకున్న కోట బద్దలు అవుతోందని.. ప్రజల అవసరాల మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆయన సొంత నిర్ణయాలు కాదని.. '175 మీరే తెచ్చుకుంటే మేము ఏం చెయ్యాలని పవన్ అంటున్నారని' ఎద్దేవా చేశారు. 2019లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఏం చేశారో అదే చెయ్యాలన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరినీ చూసి జనం ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలలో మంత్రి పాల్గొన్నారు. మన కళలను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నాలుగు జోన్‌లలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు రోజా చెప్పారు. ఇప్పటికే తిరుపతి, గుంటూరులో ఉత్సవాలు పూర్తయ్యాయని తెలిపారు. గత వెయ్యేళ్లుగా గోదావరి జిల్లాలో కళలు, సంస్కృతి విరాజల్లుతున్నాయని.. భాష, వేషం, నటనకు సంబంధించి గోదావరి జిల్లాల కళాకారులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రశంసించారు. కళామతల్లి ముద్దుబిడ్డలు గోదావరి జిల్లాల కళాకారులేనని.. కళాకారులను దూషించే వారు జీవితంలో బాగుపడరన్నారు రోజా. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. మంత్రి రోజా వేదికపై కళాకారులతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు.
అలాగే తాను 12 ఏళ్ల నుంచి నగరిలోనే ఉన్నానని.. అందుకే తనను నగరి ప్రజలు ఆదరిస్తున్నారన్నారు మంత్రి రోజా. కానీ పాయకరావుపేట ప్రజలు, కొవ్వూరు ప్రజలు వంగలపూడి అనితను చీత్కరించుకుని ఎన్నికల్లో తిప్పి కొట్టారని ఎద్దేవా చేశారు. తనపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా ఇలా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూసి ఆశ్చర్యపోయేలా రాష్ట్రాన్ని సీఎం జగన్ తీర్చిదిద్దుతున్నారన్నారు. మన సంస్కృతి, కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.