ఏదైనా బహిరంగ సభ గానీ ఇతర ట్రాఫిక్ జామ్ గానీ జరిగితే అంబులెన్స్ లోని రోగి బాధలు అన్ని ఇన్నీ కావు. సమయస్పూర్తితో అంబులెన్స్ కు దారి ఇస్తేనే రోగి ప్రాణాలను కాపాడిన వారమవుతాం. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి గుణం చూపించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి బుధవారం మదనపల్లె పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ తన మదనపల్లె పర్యటనలో భాగంగా వేదిక వద్దకు చేరుకునే సమయంలో ఆయన కాన్వాయ్‌కు ఓ ఆంబులెన్స్ ఎదురొచ్చింది.
అప్పటికే రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులతో కిక్కిరిసిపోయింది. అయితే అంత హడావుడిలోనూ అంబులెన్స్ రాకను సీఎం జగన్మోహన్ రెడ్డి గమనించారు. వెంటనే, దానికి దారి ఇవ్వాలంటూ అధికారులకు సీఎం జగన్ సూచించారు. దీంతో, కాన్వాయ్ బస్సును అధికారు పక్కన ఆపించి అంబులెన్సుకు దారి ఇచ్చారు. ఆ సమయంలో ఆంబులెన్స్ నుంచి పేషెంట్ బంధువులు చేతులెత్తి సీఎం జగన్‌కు నమస్కరించారు.
అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే అన్నారు. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గమన్నారు. పేదరికం చదువులకు అడ్డంకి కావొద్దని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చారని గుర్తు చేశారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. విద్యా దీవెనకు తోడు జగనన్న వసతి దీవెన కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చామని.. పేదలకు చదువును హక్కుగా మార్చామని వివరించారు.