సినీ నటుడు అలీ కూతురు పెళ్లి పై ఇపుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. తెలుగు సినీ పరిశ్రమలో కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అలా.. పవన్ కళ్యాణ్‌కు అలీ సెంటిమెంట్ అని.. స్వయంగా పవన్ ఓ వేదికపై చెప్పారు. అలీ లేకుండా తాను కేవలం ఒక్క సినిమానే చేశానని.. అది బాగా ఆడలేదని.. అందుకే తాను అలీ లేకుండా సినిమాలు చేయలేనని స్పష్టం చేశారు. అలీ కూడా చాలాసార్లు పవన్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. వీరిద్దరు మంచి స్నేహితులు అని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో.. పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అటు అలీ కూడా వైఎస్సార్సీపీ లో చేరి.. ఈ మధ్యే ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు.
ఇక్కడిదాకా ఎలా ఉన్నా.. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ కన్వెన్షన్‌లో అలీ పెద్ద కూతురు ఫాతిమా పెళ్లి ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహా.. రాజకీయ, సినీ ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. కానీ.. అలీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే పవన్ మాత్రం పెళ్లిలో ఎక్కడా కనిపించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ అలీకి మధ్య దూరం పెరిగిందా.. ఇంకా తగ్గలేదా అనే చర్చ జరుగుతోంది.
గతంలో అలీ కుటుంబంలో జరిగిన చాలా వేడుకలకు పవన్ హాజరై సందడి చేశారు. కానీ.. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ అలీ ఇంట జరిగిన వివాహ వేడుకలో కనిపించలేదు. అయితే.. పవన్ కళ్యాణ్‌కు దూరంగా ఉంటున్నా.. మెగా ఫ్యామిలీకి మాత్రం అలీ దగ్గరగానే ఉన్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వచ్చి అలీ కూతురుని ఆశీర్వదించారు. ఈ సమయంలోనే అన్నయ్య వచ్చినా.. తమ్ముడు రాకవపోవడంపై చర్చ జరుగుతోంది. దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయా.. లేదా పవన్ బిజిగా ఉండి రాలేదా అనే డిస్కషన్ జరుగుతోంది.
అయితే.. అలీ వైసీపీలో ఉన్నారు కాబట్టే పవన్ పెళ్లికి రాలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం.. అసలు అలీ పవన్‌ను పెళ్లికి పిలవలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇటు రాజకీయ, అటు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. చాలామంది రాజకీయ పార్టీల నేతల ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినప్పుడు.. ఇతర పార్టీల నేతలు కూడా హాజరవుతారు. కేవలం అలీ వైసీపీలో ఉన్నారనే కారణంతో పవన్ రాకుండా ఉంటారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.