పలు అంశాలలో ఏపీ సర్కార్ కు మొట్టికాయలు వేసిన ఏపీ హైకోర్టు తాజాగా రాష్ట్రంలోని ఆర్థికశాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన నియమితులైన వైద్యులకు వేతనాల విడుదలపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ వేతనాన్ని ఎందుకు జప్తు చేయరాదో చెప్పాలని కూడా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కరోనా సమయంలో వైద్య సేవల కోసం పలువురు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదిన నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని ప్రతి నెల చెల్లించాల్సిన వేతనాల్లో భాగంగా 2 నెలల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ వేతనాల కోసం తాత్కాలిక వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కు చెందిన నవంబర్ నెల వేతనాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.