జై శ్రీరాం పేరుతో బీజేపీ చేస్తున్న దూకుడును అడ్డుకొనేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా జై సియారామ్ నినాదం ఎత్తుకొన్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. అయితే అగర్-మాల్వాలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి. ఇకపై ఎవరూ జైశ్రీరామ్ అనకుండా జై సియారామ్ అనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అలా ఎందుకనాలో కూడా రాహుల్ గాంధీ బీజేపీకి తెలియజేశారు.
జై సియారామ్ అంటే ... జై సీత, జైరామ్ అని అర్థమని, సీతారాముడు ఒక్కటేనని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే జై సియారామ్ లేదా జై సీతారామ్ అని అనాలన్నారు. రాముడు, సీత గౌరవం కోసం పోరాడడని, సమాజంలో సీతలాంటి మహిళలను జయ సియారామ్ అని పిలవాలని సూచించారు. అంతేకాదు జై శ్రీరామ్ అంటే.. రాముడికొక్కడికే నమస్కారం చెబుతున్నట్టుగా ఉంటుందని, కానీ రాముడు అందరికీ గౌరవం ఇచ్చాడని రాహుల్ గాంధీ అన్నారు.
అలాగే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వాళ్లు రాముడి జీవన విధానాన్ని ఏ మాత్రం అనుసరించడం లేదని, వారి సంస్థలో సీత లేనందున వారు సియారామ్ అని అనరని, సీతను బయటకు విసిరేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. రాహుల్ గాంధీ సర్టిఫికెట్ బీజేపీకి అక్కర్లేదని ఆ పార్టీ నాయకుడు షానవాజ్ హుస్సేన్ అన్నారు. అలాగే రాహుల్ ఓ డ్రామా ట్రూప్‌కు నాయకుడు మాత్రమేనని బ్రజేష్ పాఠక్ అన్నారు. ఆయనకు భారతీయ సంస్కృతి గురించి ఏమీ తెలియదని విమర్శించారు.