జపాన్‌లోని టొట్టోరి ప్రాంతంలో అత్యంత ప్రమాదకర ఆలయం ఉంది. మిసాసా పట్టణంలో ఉన్న ఈ పురాతన బౌద్ధ ఆలయం పేరు ‘సాన్‌బుత్సుజి’. ఇది ‘మౌంట్ మిటోకు’ కొండ శిఖరం అంచున ఉంది. ఈ ఆలయంలో భాగమైన ‘నగీరెడో హాల్’ అయితే, కొండ శిఖరం అంచున వేలాడుతున్నట్లే ఉంటుంది. జపాన్‌లో ఇది ‘అత్యంత ప్రమాదభరితమైన జాతీయ నిర్మాణం’గా గుర్తింపు పొందింది. దాదాపు మూడువేల అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండ శిఖరానికి చేరుకోవాలంటే, ఎగుదుగిదుడు రాళ్ల మీద సాహసం చేయాలి. శీతాకాలంలో ఈ కొండ మీద మంచు పేరుకుపోయి ఉండటంతో ఏటా డిసెంబర్ నుంచి మార్చి వరకు దీనిని పూర్తిగా మూసి వేస్తారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉన్న కాలంలో సాహసికులైన సందర్శకులు దేశ విదేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు.