వైసీపీలోకి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ వెళ్లనున్నారని ప్రచారం సాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేశ్ పని చేస్తున్నారు. అందుకు తగ్గట్టు ప్రణాళిక రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంతో పోలిస్తే.. లోకేశ్, చంద్రబాబు మాటల దాడిని పెంచి అధికార వైసీపీని రుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు కాస్త స్తబ్దుగా ఉన్న కేడర్.. మళ్లీ ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో.. తెలుగుదేశం పార్టీని కలవరపెట్టే ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కొంతమంది నేతలు పార్టీ మారడం ఖాయం. టికెట్లు ఆశించి కొందరు, సరైన గుర్తింపు దక్కడం లేదని కొందరు నేతలు పార్టీ మారుతుంటారు. అయితే.. 2014 ఎన్నికల తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వైస్సార్సీపీ నుంచి పోటీచేసి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. కానీ.. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ మాత్రం ఎవ్వర్నీ అధికారికంగా తమ పార్టీలో చేర్చుకోలేదు.
కానీ.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాంరాం చెప్పి జగన్‌కు మద్దతు పలికారు. అధికారికంగా వైసీపీలో చేరలేదు. కానీ.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగానే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అటు జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జగన్‌కు మద్దతు పలికారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ) కూడా జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. వీరు జగన్‌కు మద్దతు పలకడానికి కారణాలు ఏమైనా.. తెలుగుదేశం పార్టీకి మాత్రం దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు చేరికలపై పెద్దగా ఫోకస్ పెట్టని జగన్.. ఇప్పుడు ఆయారాంలకు స్వాగతం చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన్ను పార్టీలోకి తీసుకోవడానికి జగన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. చాలా రోజులుగా గంటా శ్రీనివాస రావు కూడా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారానికి బలం చేకూరుతోంది.
తొలుత ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన గంటా.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయ్యారు. మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి.. 2014లో గెలిచి మంత్రి అయ్యారు. 2019లో జగన్ ప్రభంజనంలోనూ విజయం సాధించారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ తెరపైకి వచ్చారు. ఈ సమయంలోనే అధికార పార్టీకి చెందిన కీలక నేత గంటాను వైసీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అందుకు గంటా ఓకే చెప్పారని.. జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రచారం జరుగుతోంది. గంటా పార్టీ నుంచి బయటకు వెళ్తే.. టీడీపీకి నష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.