రాష్ట్ర జనాభాలో 50శాతం పైగా జనాభాగా ఉన్న వెనుకబడిన తరగతులకు (బీసీ) గత మూడున్నర సంవత్సరాల నుండి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ బీసీ ప్రతినిధుల బృందం సోమవారం మండల డిప్యూటీ తాహసీల్దార్ లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. చేతి, కులవృత్తులు చేసుకుంటూ జీవనం పొందే బీసీల అభివృద్ధి, పురోభివృద్ధి మృగ్యమైందని వివరించారు. బీసీలు హక్కుగా పొందాల్సిన సబ్న్ నిధుల నుండి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలో నిరాదరణకు, దగాకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. పైగా కార్పొరేషన్, సబ్ ప్లాన్ నిధులను మళ్లించి బీసీలకు అన్యాయం చేశారన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆ వినతిపత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర బీసీ సాధికార కార్యదర్శి సుంకర నాగేశ్వరరావుతోపాటు బాలు, నరసింహులు, పెద్దసేట్, మల్లికార్జున, రవికుమార్ పాల్గొన్నారు.