దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీ క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలు కనిపించడంలేదు. ఆధిక్యం, విజయాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటివరకు బీజేపీ 25 వార్డుల్లో విజయం సాధించి, 79 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 21 వార్డుల్లో గెలుపొందింది. మరో 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వెనకపడింది.కేవలం మూడు వార్డుల్లో విజయం సాధించి 8 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. ఢిల్లీలో మొత్తం 250 వార్డులున్నాయి. మెజారిటీకి 126 వార్డులు కైవసం చేసుకోవాలి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ బీజేపీ కంటే కొంత ఆధిక్యతలో ఉంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 250 వార్డులకు పోలింగ్ డిసెంబరు 4న జరిగింది. మొత్తం 1349 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయగా, వాటిని ఈ సంవత్సరం విలీనం చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీగా పునరుద్ధరించారు.ఈ ఏడాది మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2017 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాల్లో గెలిచి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆప్ 48, కాంగ్రెస్ 27 వార్డుల్ని కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు వెల్లడవుతున్న ఫలితాల్లో ఆమ్ ఆద్మీ అధికార పీఠానికి దగ్గరగా వెళుతోంది. రెండోసారి ఢిల్లీని గెలుచుకోవాలనుకున్న బీజేపీ వెనకబడింది.