ఉన్నతాధికార్లు మందలించారని మనస్తాపంతో ఓ తహసీల్దార్ తన కార్యాలయం ఆవరణలో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ విషాధ ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. పెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఆయన యథావిధిగా ఆఫీసుకు వచ్చారు. అటెండర్ ను పిలిచి టిఫిన్ తీసుకురావాలని చెప్పారు. టిఫిన్ తీసుకు వచ్చిన అటెండర్ కు శ్రీనివాసరావు కనిపించలేదు. దీంతో, ఆ ప్రాంతమంతా వెతకగా... పక్కనే ఉన్న ఒక షెడ్ లో ఆయన ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించాడు. అప్పటికే ఆయన మృతి చెందారు. ఈ ఘటనతో అక్కడ విషాదం అలముకుంది.
మరోవైపు ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన సమావేశానికి శ్రీనివాసరావు వెళ్లారు. ఈ సందర్భంగా భూముల సర్వే విషయంలో ఆయనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురై, ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవలే ఆయన పెదబయలు తహసీల్దారుగా బాధ్యతలను చేపట్టారు.