ప్రతి ఏడాది భారత్ లో ఎండలు మండిపోతున్నాయని, ఇది భవిష్యత్ కు ప్రమాదమని ప్రపంచ బ్యాంకు వెల్లడించిది. గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో వేలాది మరణాలకు కారణమైన తీవ్రమైన వేడి గాలులు భయంకరంగా పెరుగుతున్నాయని, త్వరలో మనిషి మనుగడ పరిమితిని మించి వడగాల్పులు వీచే ప్రపంచంలోని మొదటి దేశంగా భారత్ మారొచ్చని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. ‘భారత శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలు’ పేరుతో ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను రూపొందించింది. భారత్ ముందస్తు అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటోందని, ఇది చాలా కాలం పాటు ఉంటుందని నివేదికలో అంచనా వేసింది.
‘‘ఏప్రిల్ 2022లో వేసవి ప్రారంభంలోనే వేడిగాలులతో భారత్ ఉక్కిరిబిక్కిరయ్యింది.. ఇది దేశాన్ని స్తంభింపజేసింది.. రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ ((114 డిగ్రీల ఫారెన్‌హీట్) నమోదయ్యాయి.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెలలో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదయ్యింది’’ అని పేర్కొంది.
కేరళ ప్రభుత్వంతో కలిసి ప్రపంచ బ్యాంకు నిర్వహిస్తున్న రెండు రోజుల ‘ఇండియా క్లైమేట్ అండ్ డెవలప్‌మెంట్ పార్టనర్స్ మీట్’ సందర్భంగా ఈ నివేదికను విడుదల చేయనున్నారు. భారత్‌లో వడగాల్పులు పరిస్థితి మానవ మనుగడ పరిమితిని విచ్ఛిన్నం చేయగలదని అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు.. దక్షిణాసియా అంతటా పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి అనేక మంది వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరించిన దానికి ఇటీవల పరిస్థితులు మద్దతు ఇస్తాయని పేర్కొంది.
‘‘ఆగస్టు 2021లో వాతావరణ మార్పులపై ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) ఆరో నివేదిక రాబోయే దశాబ్దంలో భారత ఉపఖండం మరింత తీవ్రమైన వేడి గాలులను ఎదుర్కొంటుందని చెప్పింది.. IPCC అంచనా ప్రకారం కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఉంటే 2036-65 నాటికి భారత్ అంతటా వేడి గాలులు 25 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందని G20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ 2021లో హెచ్చరించింది’’ అని నివేదిక పేర్కొంది.
భారత్ అంతటా పెరుగుతున్న వేడి ఆర్థిక ఉత్పాదకతను దెబ్బతీస్తుందని కూడా నివేదిక హెచ్చరించింది. ‘‘భారతదేశంలోని శ్రామికశక్తిలో 75 శాతం లేదా 380 మిలియన్ల మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు.. కొన్నిసార్లు ప్రాణాంతక ఉష్ణోగ్రతలలో పని చేస్తున్నారు.... 2030 నాటికి 80 మిలియన్ల ప్రపంచ కార్మికులలో భారత్‌కు చెందిన 34 మిలియన్లను మంది ఉష్ణ ఒత్తిడితో సంబంధం ఉన్న ఉత్పాదకత క్షీణతతో నష్టపోతారని అంచనా’’ అని నివేదిక పేర్కొంది.
దక్షిణాసియా దేశాలలో భారత్ కార్మికులపై అత్యధిక ఉష్ణోగ్రత ప్రభావం చూపిందని, సంవత్సరానికి 101 బిలియన్ గంటల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొంది. గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ మెకిన్‌సే అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం.. పెరుగుతున్న వేడి, తేమ కారణంగా కోల్పోయిన కార్మికులు ఈ దశాబ్దం చివరినాటికి భారతదేశ జీడీపీలో 4.5 శాతం.. సుమారు 150-250 బిలియన్ అమెరికా డాలర్లు ప్రమాదంలో పడొచ్చు. భారత్ దీర్ఘకాలిక ఆహార, ప్రజారోగ్య భద్రత నమ్మకమైన కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
భారతదేశం అంతటా ఆహారం, ఔషధాలను రవాణా చేయడానికి అడుగడుగునా పనిచేసే కోల్డ్ చైన్ శీతలీకరణ వ్యవస్థ అవసరం. ‘ప్రయాణంలో ఒక్కసారి ఉష్ణోగ్రత తగ్గడం వల్ల శీతలీకరణ వ్యవస్థ విచ్ఛినమై తాజా ఉత్పత్తులు చెడిపోవచ్చు.. టీకాల శక్తిని బలహీనపడుతుంది. భారతదేశంలో తాజా ఉత్పత్తుల్లో కేవలం 4 శాతం మాత్రమే కోల్డ్ చైన్ సౌకర్యాలతో ఉన్నాయి.. మొత్తం 13 బిలియన్ ఆహార నష్టం వాటిల్లుతుందని వార్షిక అంచనా’ అని చెప్పింది.
కోవిడ్-19కి ముందు ప్రపంచంలోని ఔషధాల ఉత్పత్తిలో మూడో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారత్.. శీతలీకరణ వ్యవస్థ చెడిపోవడంతో దాదాపు 20 శాతం ఉష్ణోగ్రత-సున్నితమైన వైద్య ఉత్పత్తులు, 25 శాతం వ్యాక్సిన్‌లను కోల్పోయింది.. ఏడాదిలో ఇది 313 మిలియ డాలర్లు నష్టానికి దారితీసిందని పేర్కొంది.
‘భారతదేశం అంతటా ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, శీతలీకరణకు డిమాండ్ పెరుగుతుంది. అయితే, జనాభాలో మూడింట రెండొంతుల మంది రోజుకు 2 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న దేశంలో ఎయిర్ కండిషనింగ్ యూనిట్ సగటు ధర 260 నుంచి 500 డాలర్లకు చేరవచ్చు.. విలాసవంతమైన ఎయిర్-కూలింగ్ సిస్టమ్‌లు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.. ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ (ICAP)లో సమర్పించిన విశ్లేషణ ప్రకారం.. కేవలం ఎనిమిది శాతం భారతీయ కుటుంబాలు మాత్రమే ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను కలిగి ఉన్నాయి.
‘ఇండోర్, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు థర్మల్ సౌకర్యాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి.. అయితే ఇవి కొనడానికి చాలా ఖరీదైనవి.. అసమర్థమైనవి. తత్ఫలితంగా భారత్‌లోని అనేక పేద, అట్టడుగు వర్గాలకు తీవ్రమైన వేడి మరింత హాని కలిగిస్తుంది. సరైన శీతలీకరణకు వ్యవస్థ, తగినంత వెంటిలేషన్, వేడి, రద్దీగా ఉండే ఇళ్లలో నివసిస్తున్నారు’ అని నివేదిక స్పష్టం చేసింది.