మనం ఉండే పరిసరాల్లో బోరు బావి గుంతల పట్ల ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. తాజాగా 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ 400 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బైతైల్ జిల్లా మండవి గ్రామంలో తన్మయ్ దియావర్ అనే బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తన్మయ్ 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. బాలుడికి ఊపిరి ఆడేలా ఆక్సిజన్ పైపును లోపలికి పంపించారు. తాడు సహాయంతో బాలుడ్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా.. 12 అడుగుల వరకు వచ్చిన తర్వాత తాడు తెగిపోయింది. దీంతో ప్రొక్లెయిన్‌తో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు.
బాలుడ్ని బటయకు తీయడానికి 24 గంటలుగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు, అధికారులు ఏర్పాటుచేసిన సాధనం ద్వారా తండ్రితో మాట్లాడిన బాలుడు ‘‘నాన్నా.. ఇక్కడ చీకటిగా ఉంది. భయం వేస్తోంది. నన్ను త్వరగా బయటకు తీయండి’’ అని వేడుకోవడం అక్కడివారిని కదిలించింది.
బేతూల్ అడిషినల్ జిల్లా మేజిస్ట్రేట్ శ్యామేంద్ర జైస్వాల్ మాట్లాడుతూ.. బాలుడ్ని బయటకు తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతుండగా రాళ్లు అడ్డంగా వచ్చాయని, వాటిని మిషన్ సాయంతో తొలగించాల్సి వస్తోందన్నారు. జేసీబీ, ప్రొక్లెయిన్ మెషీన్‌లు వినియోగిస్తున్నామని చెప్పారు.
బోరుబావికి సమాంతరంగా ఇప్పటి వరకూ 40 అడుగులు లోతు గొయ్యి తవ్వామని, వైద్య బృందం కూడా ఘటనా స్థలంలో ఉందని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, హోమ్ గార్డు, పోలీసులు బాలుడ్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. డిసెంబరు 6న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన్మయ్ బోరుబావిలో పడిపోయాడు. తన్మయ్ బోరుబావిలో పడిపోవడాన్ని చూసిన 12 ఏళ్ల అతడి సోదరి.. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.