ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొత్త నాటకానికి ఇద్దరు సీఎంలు తెరదీశారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సజ్జల మాటల వెనుక కేసీఆర్ హస్తం ఉందని... కేసీఆర్ ప్రోద్భలంతో సజ్జల ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, కవిత కేసులు, ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ ఈ ప్రకటనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు, మాటలు ఆపాలని రెండు రాష్ట్రాల సీఎంలను కోరారు. ప్రధాన మంత్రి గురించి మాట్లాడే స్థాయి కేసీఆర్‌కు లేదని.. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్‌ను ఎదుర్కుంటే చాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిందని... త్వరలో వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమని యెద్దేవా చేశారు. ఏపీలో ఆర్థిక ఎమెర్జెన్సీ నెలకొందని తెలిపారు. అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ఏపీ ఆర్ధిక మంత్రి అప్పుల మంత్రిగా మారిపోతున్నారన్నారు. తెచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో లెక్కలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.